భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి, తొలిసారిగా ప్రపంచ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ప్రదర్శనపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, లోకనాయకుడు కమల్ హాసన్ సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా టీమిండియాను అభినందించారు. చిరంజీవి ఈ విజయాన్ని భారత క్రికెట్ చరిత్రలో గర్వించదగ్గ రోజుగా అభివర్ణించారు. కమల్ హాసన్ ఈ చారిత్రక విజయాన్ని 1983 పురుషుల ప్రపంచకప్ విజయంతో పోల్చారు, ఈ చరిత్ర స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మహేశ్ బాబు ఈ విజయాన్ని “అద్భుతమైన క్షణం”గా అభివర్ణించారు. “మువ్వన్నెల జెండా ఎత్తుగా ఎగరడం గర్వకారణం. ఈ విజయం మన దేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీక” అని ఆయన పేర్కొన్నారు. నటులు గోపీచంద్, మంచు మనోజ్ కూడా మహిళల జట్టు ప్రతిభ, పట్టుదలను ప్రశంసిస్తూ, ఈ విజయం దేశానికి కొత్త స్ఫూర్తినిచ్చిందని వ్యాఖ్యానించారు.









