భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వారసత్వాన్ని ఆయన చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇటీవల కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అవార్డులు అందుకోవడంతో పాటు, గత నెలలో వీనూ మాంకడ్ ట్రోఫీలో కర్ణాటకకు కెప్టెన్‌గా వ్యవహరించిన అన్వయ్, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక పెద్ద అవకాశం దక్కించుకున్నాడు. బుధవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులో అన్వయ్ చోటు దక్కించుకున్నాడు.
రాహుల్ ద్రవిడ్ లాగే ఆయన కుమారులు ఇద్దరూ క్రికెట్ ఆడుతున్నారు. చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌ను అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో టీమ్ C తరపున ఆడేందుకు ఎంపిక చేశారు. అన్వయ్ ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మరియు వికెట్ కీపర్‌గా దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో పేరుగాంచారు. ఈ టోర్నమెంట్ నవంబర్ 5 నుండి 11, 2025 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. టీమ్ C తమ మొదటి మ్యాచ్‌ను శుక్రవారం టీమ్ B తో ఆడనుంది, ఈ మ్యాచ్‌లో అన్వయ్ ఆడే అవకాశం ఉంది.
ఈ టోర్నమెంట్ యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఒక ముఖ్యమైన వేదిక. అన్వయ్ ద్రవిడ్‌కు ఇది తన ముద్ర వేయడానికి మరియు క్రికెట్ కెరీర్లో మరింత ఎదగడానికి బంపర్ ఆఫర్ అవుతుంది. రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా బ్యాట్స్‌మెన్ కావడం విశేషం.









