ప్రయాణికుల భద్రత కోసం హైదరాబాద్ మెట్రోలో కీలక నిర్ణయం: స్టీల్ గ్రిల్స్ ఏర్పాటుకు సన్నాహాలు

హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రయాణికుల భద్రత కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రద్దీ సమయాల్లో ప్లాట్‌ఫామ్‌లపై తోపులాటలు జరిగి, ప్రయాణికులు రైలు పట్టాలపై పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, మెట్రో ప్లాట్‌ఫామ్‌ల వద్ద స్టీల్ గ్రిల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఉక్కు కంచెను మెట్రో రైలు డోర్ల వద్ద కాకుండా, కోచ్‌ల పొడవునా ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ చర్య ద్వారా రైలు వచ్చే సమయంలో జరిగే తోపులాటల నుంచి ప్రయాణికులను రక్షించవచ్చని మెట్రో అధికారులు భావిస్తున్నారు.

ఈ స్టీల్ గ్రిల్స్ ఏర్పాటును మొదట కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో అమలు చేసి, వాటి పనితీరును పరిశీలిస్తారు. ఆ తర్వాత, క్రమంగా నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లకు దీనిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, రానున్న రెండున్నర ఏళ్లలో హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్లలో ఈ స్టీల్ గ్రిల్స్ అందుబాటులోకి రానున్నాయి. మెట్రో రైళ్లలో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండటం, రద్దీ సమయాల్లో ప్లాట్‌ఫామ్‌లు కిక్కిరిసిపోతుండటం వంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, మెట్రో అధికారుల ఈ నిర్ణయంపై ప్రయాణికులు, నెటిజన్ల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. చాలా మంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇది ప్రమాదాలను నివారించడానికి తోడ్పడుతుందని, ఆలస్యంగానైనా ఈ ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కానీ, కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయడం వల్ల రైలు, గ్రిల్స్ మధ్య ప్రయాణికులు ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని, అలాగే రైలు ఎక్కే, దిగే సమయంలో తోపులాటలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు