గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక బంగారం దుకాణంలో చోటుచేసుకున్న చోరీ యత్నం విఫలమైంది. కస్టమర్‌లా దుకాణంలోకి ప్రవేశించిన ఓ మహిళ, కౌంటర్‌లో ఉన్న యువకుడి కళ్లల్లో మిరప పొడి (కారం) కొట్టి చోరీకి ప్రయత్నించింది. అయితే, వెంటనే తేరుకున్న ఆ యువకుడు ఆమెను ప్రతిఘటించాడు. ఊహించని ఈ పరిణామానికి ఆ మహిళ భయపడటంతో పాటు, ఆ యువకుడి పిడిగుద్దులకు ఆమె తుక్కు తుక్కు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
నవంబర్ 3న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అహ్మదాబాద్‌లోని రణీప్ కూరగాయల మార్కెట్ సమీపంలోని ఒక బంగారం, వెండి దుకాణంలో ఈ ఘటన జరిగింది. దుపట్టాతో ముఖాన్ని కప్పుకున్న ఆ మహిళ కస్టమర్‌లా నటిస్తూ దుకాణంలోకి ప్రవేశించింది. ఆ వెంటనే ఆమె అకస్మాత్తుగా దుకాణదారుడి కళ్లలోకి కారం కొట్టింది. అయితే, దుకాణదారుడి కళ్లలో అది సరిగ్గా పడలేదు. తన ఉద్దేశాన్ని గ్రహించిన యువకుడు వెంటనే కౌంటర్‌పైకి ఎగిరి ఆమెను బయటకు లాగి పిడిగుద్దులు కురిపించడం మొదలుపెట్టాడు. ఆ యువకుడు కేవలం 25 సెకన్లలో ఆ మహిళ ముఖంపై దాదాపు 20 పిడిగుద్దులు కురిపించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైంది.
ఈ ఘటనపై దుకాణదారుడు ఫిర్యాదు ఇవ్వడానికి నిరాకరించాడని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు. ఫిర్యాదు చేయాలని తాము వ్యాపారిని రెండు సార్లు వ్యక్తిగతంగా కలిసినట్టు కూడా పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, యువకుడి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.









