టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్న జంటగా నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఘన విజయాన్ని సాధించింది. గీతా ఆర్ట్స్ సమర్పణలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దుర్గ అనే కీలక పాత్ర పోషించిన యువ నటి అను ఇమ్మాన్యుయేల్ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్, ముఖ్యంగా తన పాత్ర గురించి విన్న వెంటనే నటించాలని నిర్ణయించుకున్నానని, అమ్మాయిల గురించి మంచి విషయం చెప్పే ఈ మూవీలో నటించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె తెలిపారు.
స్టార్ హీరోలైన పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ, తన కెరీర్‌లో కొన్ని కమర్షియల్ సినిమాలు చేసి ఉండకూడదని ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నట్లు అను ఇమ్మాన్యుయేల్ వెల్లడించారు. నాలుగు డ్యాన్స్ స్టెప్పులు వేసి, రొటీన్ డైలాగ్స్ చెప్పించే కమర్షియల్ చిత్రాలు నటిగా ఎలాంటి సంతృప్తిని ఇవ్వవని, ఇకపై అలాంటి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే, “ది గర్ల్ ఫ్రెండ్” వంటి సినిమాలు తన సంతృప్తి కోసం, ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.
ఈ సినిమాలో తన పాత్ర దుర్గ గురించి మాట్లాడుతూ, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చాలా సెన్సిటివ్ డైరెక్టర్ అని ప్రశంసించారు. కమర్షియల్ సినిమాల్లో లాగా ఓవర్ యాక్షన్ కాకుండా, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ టోన్ డౌన్ చేసి సహజంగా నటించమని రాహుల్ సూచించారని తెలిపారు. దుర్గ పాత్రకు తనే అమెరికన్ యాక్సెంట్‌తో డబ్బింగ్ చెప్పడం వల్ల ఆ పాత్ర మరింత సహజంగా కనిపించిందని ఆమె చెప్పారు. హాలీవుడ్ సినిమాలలో హీరో, హీరోయిన్, విలన్ అనే విభజన ఉండదని, ప్రతి పాత్ర కథకు దోహదపడుతుందని, “ది గర్ల్ ఫ్రెండ్” లో రాహుల్ అలాంటి ప్రయత్నమే చేశారని అను ఇమ్మాన్యుయేల్ అభిప్రాయపడ్డారు.









