పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై పవన్ కల్యాణ్ సంచలన వీడియో

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం దాదాపు 76.74 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకుందని, అక్కడ చెట్లను నరికివేసి, గెస్ట్ హౌస్‌ను నిర్మించుకోవడంతో పాటు దారిని కూడా ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ తన సెల్ ఫోన్‌లో ఈ అక్రమాలకు సంబంధించిన వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

పవన్ కల్యాణ్ మంగళంపల్లి అటవీ భూములకు సంబంధించిన వీడియోను విడుదల చేస్తూ, అటవీ భూములను ఆక్రమించుకున్న వారిని ఎవరినైనా వదిలిపెట్టవద్దని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ భూములను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, కుడిభుజంగా పేరుపొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణల వ్యవహారం గతంలోనూ వెలుగులోకి వచ్చినప్పటికీ, అటవీ శాఖ అధికారులు నమోదు చేసిన కేసులు అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు.

తాజాగా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ స్వయంగా వీడియోను విడుదల చేయడం, సంబంధిత అధికారులను తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ప్రభుత్వ అధికారుల్లోనూ కదలిక రావాలనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్లుగా కనబడుతోంది. గతంలో కేసు నమోదు చేసినా ముందుకు కదలకపోవడాన్ని పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. మరి పవన్ కల్యాణ్ ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయన్నది వేచి చూడాలి.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు