హరీష్ రావు ద్రోహం వల్లే బీఆర్ఎస్ ఓటమి – కవిత సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత మరోసారి మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత మరింత దూకుడుగా మారిన కవిత, మెదక్ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ, హరీష్ రావు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా, హరీష్ రావు కుటుంబం ప్రైవేట్‌గా పాల వ్యాపారం చేసి, పాల రైతులకు అన్యాయం చేసిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. టెండర్ ప్రక్రియ లేకుండానే హాస్టళ్లు, హాస్పిటల్స్‌కు పాలు సరఫరా చేసి రూ. 50-100 కోట్లు వ్యాపారం చేశారని, ఇది ప్రభుత్వ డైరీలకు పోటీగా, రైతులకు ద్రోహం చేసేలా జరిగిందని కవిత స్పష్టం చేశారు. ఈ అక్రమ పాల వ్యాపారం ద్వారా రూ. 200 కోట్లకు పైగా అక్రమ ఆదాయం వచ్చిందని ఆమె ఆరోపించారు.

హరీష్ రావుది మోసం చేసే నైజమని, ఆయన పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీశ్‌రావుకు అలవాటని విమర్శించారు. బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని 15 మంది ఇండిపెండెంట్లు తనను అడిగితే తనకు సంబంధం లేదని చెప్పానని, కానీ వారు హరీశ్‌రావు వద్దకు వెళ్లగా ‘మీ ఇష్టం’ అని ఆయన సమాధానమిచ్చారని కవిత ఆరోపించారు. పార్టీలో కీలక నేతగా ఉండి కూడా హరీశ్‌రావు ఇలా వ్యవహరించడం మోసం కాదా అని ఆమె ప్రశ్నించారు. అంతేకాక, కేటీఆర్, హరీశ్‌రావు పేరుకే కృష్ణార్జునులని, ట్వీట్లు చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని విమర్శించారు.

హరీష్ రావు వ్యక్తిగత ఆస్తులపైనా కవిత తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను హరీష్ రావు తన 400 ఎకరాల ఫామ్ హౌస్‌ను కాపాడుకునేందుకే మార్చారని రైతులు చెబుతున్నారని ఆమె అన్నారు. ఆయన ఆ ఫామ్ హౌస్‌లో సెవెన్ స్టార్ రిసార్ట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇదే విధంగా బీఆర్ఎస్ నేతలు జగదీశ్ రెడ్డి, మదన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి వారికి వందల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. చివరగా, హరీష్ రావు మరియు సీఎం రేవంత్ రెడ్డి దోస్తులని, హరీశ్‌రావు బినామీలు, వారి కంపెనీలతో రేవంత్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని కవిత సంచలన ఆరోపణలు చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు