ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌కు ముందు భారీ మార్పు జరిగింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ రాబోయే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడనున్నాడు. ఈ ట్రేడ్ డీల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్ (RR) నుంచి వైదొలగాలని శాంసన్ చేసిన ప్రకటన తర్వాత సీఎస్కే అతడ్ని రూ.18 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ మొత్తం గత సీజన్‌లో రాజస్థాన్‌లో అందుకున్న మొత్తానికి సమానం. దీనికి బదులుగా, సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. సీఎస్కేలో ఎంఎస్ ధోనితో కలిసి ఆడనున్న సంజూ శాంసన్, ట్రేడ్ అధికారిక ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టాడు.
రాజస్తాన్‌ను వీడి సీఎస్కేలో చేరిన తర్వాత సంజూ శాంసన్ చేసిన మొదటి పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకుంటున్న సంజూ, పసుపు రంగు (CSK జెర్సీ రంగు) బ్యాండ్ మరియు టీషర్ట్ ధరించి ఉన్నాడు. ఆ పోస్ట్‌లో కేవలం “వణక్కం” (తమిళంలో నమస్తే) అని క్యాప్షన్ ఇచ్చాడు. అంతకుముందు, రాజస్థాన్ రాయల్స్‌ను వీడుతున్నట్లు భావోద్వేగ పోస్ట్ చేశాడు. “నేను ఇక్కడ కొద్దికాలం మాత్రమే ఉన్నాను. ఈ ఫ్రాంచైజీకి నా వంతు కృషి చేశా. గొప్ప క్రికెట్‌ను ఆస్వాదించాము. కొన్ని జీవితకాల అనుబంధాలు ఏర్పడ్డాయి. ఫ్రాంచైజీలోని వారందరినీ మా కుటుంబంగా భావించా. సమయం వచ్చింది, నేను ముందుకు సాగుతున్నాను. ఫ్రాంచైజీలో ఇప్పటివరకూ అన్ని విషయాలకూ ఎల్లప్పుడూ కృతజ్ఞుడను” అని రాజస్తాన్ రాయల్స్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు.
సంజు శాంసన్ ఐపీఎల్ కెరీర్‌లో సీఎస్కే మూడవ జట్టు కానుంది. అతను 2013 నుండి 2015 వరకు రాజస్థాన్ రాయల్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత 2016, 2017లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడి, 2018లో తిరిగి రాజస్థాన్‌కు వచ్చాడు. ఐపీఎల్‌లో 177 మ్యాచ్‌లు ఆడిన సంజు శాంసన్ 4704 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాజస్తాన్ కెప్టెన్‌గా సేవలు అందించిన శాంసన్, ఇప్పుడు సీఎస్కేలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, భవిష్యత్తులో సీఎస్కే జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.









