కృష్ణా నదీ జలాల వివాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ముందు త్వరలో జరగనున్న విచారణలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఆయన ఆ లేఖలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిలో 763 టీఎంసీల నీటిని తమ రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేస్తుండగా, ఈ డిమాండ్‌కు అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడటంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని జగన్ ఆరోపించారు. “ప్రభుత్వం ట్రైబ్యునల్ ముందు బలహీనమైన వాదనలు వినిపిస్తోంది. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యంగా ఉంది” అని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని కూడా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వ వైఖరి సరిగా లేకపోవడం వల్లే పొరుగు రాష్ట్రాలు ఏపీకి నష్టం కలిగించే చర్యలు తీసుకుంటున్నాయని విమర్శించారు.
గతంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు పనులు మొదలయ్యాయని, అప్పుడు రైతులు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకోలేదని జగన్ గుర్తుచేశారు. ఈ కీలక తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరించి, బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర జలాల్లో ఒక్క టీఎంసీ తగ్గినా, అందుకు టీడీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.









