హిడ్మా మృతిపై మావోయిస్టుల సంచలన లేఖ: నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినం!

ప్రముఖ మావోయిస్టు అగ్రనేత హిడ్మా (శంకర్) మృతి తర్వాత, మావోయిస్టు పార్టీ తమ ఉనికిని చాటుకుంటూ సంచలన లేఖను విడుదల చేసింది. హిడ్మా మరియు ఇతర కామ్రేడ్లవి క్రూరమైన హత్యాకాండలు అని ఈ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హిడ్మాను, అతని భార్యను మరియు ఇతరులను పట్టుకుని అతి కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. మారేడుమిల్లిలో ఫైరింగ్ జరిగింది అంటూ పోలీసులు, ప్రత్యేక దళాలు అల్లిన కట్టుకథలను ఈ లేఖ ఖండించింది.

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మరియు కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కొంతమంది వ్యక్తులతో కలిసి విజయవాడకు చికిత్స కోసం వెళ్లారని లేఖలో తెలిపారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే పోలీసులకు సమాచారం చేరిందని, కేంద్ర హోం మినిస్టర్ ఆదేశాల మేరకు ఆంధ్ర ఎస్ఓబి బెటాలియన్ వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై, చివరకు క్రూరంగా హత్య చేసిందని మావోయిస్టులు ఆరోపించారు. ఈ క్రూర హత్యకాండకు నిరసనగా నవంబర్ 23వ తేదీని దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.

కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ‘అభయ్’ పేరుతో విడుదలైన ఈ లేఖతో, మావోయిస్టుల భవిష్యత్ కార్యాచరణపై చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న తరుణంలో, అగ్రనేతలు హతమవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, హిడ్మా స్థానంలో అదే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక వ్యక్తి దండకారణ్య పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లేఖ ద్వారా, ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంత పటిమను చాటుకున్న కామ్రేడ్ శంకర్‌కు (హిడ్మాకు) శిరస్సు వంచి శ్రద్ధాంజలి అర్పిస్తున్నట్లు మావోయిస్టులు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు