తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ: రూ.117.30 కోట్లతో ఆధునికీకరణ

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ రాష్ట్రంలోని పది ప్రభుత్వ జూనియర్ కళాశాలల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టింది. మైనారిటీ విద్యార్థులు అధికంగా ఉన్న ఈ కళాశాలల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం (PMJVK) కింద మొత్తం రూ. 117.30 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, శిథిలావస్థలో ఉన్న భవనాలు, మౌలిక వసతుల లేమి వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.

ఈ ప్రాజెక్టులో ఎంపిక చేసిన పది కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నూతన భవనాలను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త భవనాలతో పాటు, విద్యార్థులకు మెరుగైన అభ్యాస అనుభవాన్ని అందించడానికి స్మార్ట్ తరగతి గదులు (స్మార్ట్ క్లాస్‌రూమ్స్), నూతన ఫర్నిచర్, అత్యాధునిక ప్రయోగశాలలు, లైబ్రరీల విస్తరణ వంటి సౌకర్యాలు కల్పించడానికి ప్రతిపాదనలు చేశారు. మొత్తం వ్యయం రూ. 117.30 కోట్లలో కేంద్ర ప్రభుత్వం 60% (రూ. 70.38 కోట్లు), రాష్ట్ర ప్రభుత్వం 40% (రూ. 46.92 కోట్లు) భరించాల్సి ఉంటుంది.

ఈ పది కళాశాలల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (GJC బాయ్స్) మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (GVJC) ప్రాంగణంలో ఏకంగా రూ. 27.30 కోట్లతో ఒక హైటెక్ ‘ఇంటిగ్రేటెడ్ భవనం’ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ హైటెక్ భవనం ఈ ప్రాంతంలోని మైనారిటీ విద్యార్థులకు ఒక వరం కానుంది. మిగిలిన తొమ్మిది కళాశాలలకు ఒక్కొక్క దానికి సుమారు రూ. 10 కోట్లు కేటాయించాలని ఇంటర్మీడియెట్ విద్యా డైరెక్టరేట్ కోరింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు