విమాన భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. పైలట్లు, క్యాబిన్ సిబ్బందితో పాటు విమాన షెడ్యూళ్లను ప్లాన్ చేసే సిబ్బందికి కూడా ఏటా ఫాటిగ్ మేనేజ్మెంట్పై (అలసట నిర్వహణ) శిక్షణను తప్పనిసరి చేసింది. ఇటీవల కాలంలో విమాన సిబ్బంది పని గంటలు పెరగడం మరియు వారి అలసట విమాన భద్రతపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనల నేపథ్యంలో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రతీ విమానయాన సంస్థ తమ రెగ్యులర్ గ్రౌండ్ ట్రైనింగ్‌లో భాగంగా ఏటా కనీసం ఒక గంట ప్రత్యేక శిక్షణను ఇవ్వాలి. ఈ శిక్షణలో విమాన ప్రయాణ గంటలు, డ్యూటీ పరిమితులు, తప్పనిసరి విశ్రాంతి నియమాల గురించి వివరిస్తారు. అంతేకాకుండా, నిద్రకు సంబంధించిన శాస్త్రీయ అంశాలు, శరీర గడియారాన్ని (బాడీ క్లాక్) ప్రభావితం చేసే అంశాలు, అలసట పనితీరుపై ఎలా ప్రభావం చూపుతుందనే విషయాలపై అవగాహన కల్పించడం ఈ ట్రైనింగ్‌లో ప్రధాన భాగం.
అలసట సమస్యలను పరిష్కరించడానికి, సిబ్బంది తమ అలసట గురించి ఫిర్యాదు చేసేందుకు పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని డీజీసీఏ ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. అలాగే, ఈ ఫిర్యాదులను సమీక్షించి, అవసరమైన దిద్దుబాటు చర్యలు సూచించేందుకు ఒక స్వతంత్ర ఫాటిగ్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలి. నిబంధనల అమలుపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి, శిక్షణ పొందిన సిబ్బంది వివరాలు, వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను డీజీసీఏకు పంపాలని ఆదేశాలు స్పష్టం చేశాయి.









