ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంకా గత వైసీపీ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ, ఏ సమస్య వచ్చినా ‘గత ప్రభుత్వ వైఖరి’ని ఆపాదిస్తూ మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వాన్ని నిందించడంపై నెటిజన్ల నుంచి, విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి ఉదాహరణగా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర జలాల కారణంగా కొబ్బరి చెట్లు నాశనమైన రైతుల సమస్యను తెలుసుకునేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్.. మరోసారి వైసీపీని విమర్శించారు. అయితే, అక్కడి రైతు ఈ సమస్య నలభై ఏళ్లుగా ఉందని చెప్పడంతో, సమస్య చరిత్రను పూర్తిగా తెలుసుకోకుండా కేవలం గత ప్రభుత్వాన్ని నిందించే ధోరణి సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమైంది.
మరోవైపు, పవన్ కల్యాణ్ చేసిన “మరో పదిహేనేళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి” అనే వ్యాఖ్యలు కూడా ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గతంలో సుమారు పదిహేడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా పవన్ కల్యాణ్ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే, ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాల విషయంలో గళం విప్పితేనే ఆయన రాజకీయాల్లో హీరోగా నిలబడతారనే కామెంట్లు జనసేన క్యాడర్ నుంచే వినపడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.









