తెలంగాణలో నేటి నుంచి బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’ కార్యక్రమాలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టమైన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను గుర్తుచేసుకుంటూ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ‘దీక్షా దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించిన రోజు (నవంబర్ 29) నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలి ప్రకటన విడుదలైన డిసెంబర్ 9వ తేదీ వరకూ, మొత్తం పదకొండు రోజుల పాటు ఈ కార్యక్రమాలను ఊరూరా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ‘దీక్షా దివస్’ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రంలో ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో నేటి నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పార్టీ కార్యాలయాలను గులాబీ జెండాలతో పాటు కేసీఆర్ ఫ్లెక్సీలతో అలంకరించారు. ఊరూరా గులాబీ జెండాలు కట్టి, నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, కేసీఆర్ త్యాగాన్ని నెమరువేసుకోవాలని పార్టీ నిర్ణయించింది.

ఈ ‘దీక్షా దివస్’లో భాగంగా ఇవాళ (నవంబర్ 29) హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగే ముఖ్య కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు. రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేపట్టిన దీక్ష చరిత్ర, దాని ద్వారా ఏర్పడిన ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు మరోసారి వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. పదకొండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల నిర్వహణకు బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు