నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను (Cyclone Dithwa) ముప్పు నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తుపాను తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసి, ప్రభావిత జిల్లాలను వెంటనే అలెర్ట్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో భాగంగా సహాయక చర్యల కోసం ఎస్.డి.ఆర్.ఎఫ్ (SDRF), ఎన్.డి.ఆర్.ఎఫ్ (NDRF) బృందాలను సిద్ధం చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు.
తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి, ముందస్తు జాగ్రత్త చర్యలను పటిష్టంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను సమాచారాన్ని నిరంతరం క్రిందిస్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అలెర్ట్‌గా ఉండాలని, 24/7 కంట్రోల్ రూమ్‌లను (Control Rooms) కొనసాగించాలని మంత్రి అనిత సూచించారు. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 లను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లోని వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్తు అంతరాయం, విరిగిన చెట్ల తొలగింపు పనులను తక్షణమే చేపట్టాలని ఆమె ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.









