దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, సోషల్ మీడియాలో సెలబ్రిటీల మరణాలను సైతం వినోదం కోసం మీమ్స్‌గా మార్చే దారుణమైన ధోరణిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ సంస్కృతి మానవ నైతికతను దెబ్బతీస్తోందని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తన తల్లి శ్రీదేవి మరణం గురించి మాట్లాడాలంటే తనకు ఎప్పుడూ భయం ఉండేదని జాన్వీ తెలిపారు. “అమ్మ మరణాన్ని అడ్డం పెట్టుకుని పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నానని ప్రజలు అనుకుంటారేమోనన్న ఆలోచన నన్ను వెనుకాడేలా చేసేది. ఆమెను కోల్పోయిన ఆ బాధ, భావోద్వేగాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి, మాటల్లో చెప్పలేనివి” అని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.
ప్రస్తుత జర్నలిజం మరియు సోషల్ మీడియా తీరు ప్రమాదకరంగా మారుతోందని జాన్వీ అన్నారు. ధర్మేంద్ర వంటి ప్రముఖులు జీవించి ఉండగానే వారి మరణంపై వదంతులు సృష్టించి, దానిపైనా మీమ్స్ చేయడం ఎంతో పాపమని ఆమె అన్నారు. 2018లో శ్రీదేవి అనుకోకుండా మరణించినప్పుడు, ఆ విషాదంలో ఉన్న తమ కుటుంబాన్ని కూడా సోషల్ మీడియా మీమ్స్ మరింత వేదనకు గురిచేశాయని ఆమె గుర్తు చేసుకున్నారు.









