ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఇలాంటి మాటలు వైషమ్యాలను రెచ్చగొట్టడానికి కారణమవుతాయని ఆమె విమర్శించారు.
పవన్ కళ్యాణ్ బాధ్యతారహితంగా ఈ మాటలు మాట్లాడారని, ఉపముఖ్యమంత్రిగా ఇది సబబు కాదని షర్మిల అన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, శంకరగుప్తం డ్రెయిన్‌కు గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపోవడం వల్లే సముద్రం నుంచి ఉప్పు నీళ్లు పైకొచ్చి చెట్లు కూలిపోతున్నాయని, ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదని ఆమె పవన్ కళ్యాణ్‌కు సూచించారు.
మరోవైపు, సీపీఐ నేత నారాయణ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని, తెలుగు ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని నారాయణ ఆరోపించారు.









