తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 3న ముగియడంతో, పోటీలో మిగిలిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరగనుండగా, ఈ ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల సంఘం రోజువారీ వినియోగించే వస్తువులకు సంబంధించిన 30 గుర్తులను కేటాయించింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులను పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా కేటాయిస్తారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమ పేరును నమోదు చేసుకున్న విధానం ఆధారంగా, పేరులోని మొదటి అక్షరం ప్రకారం వారికి గుర్తుల ప్రాధాన్యత లభిస్తుంది. ఉదాహరణకు, ‘అరవింద్’ అనే అభ్యర్థికి, ‘వాణి’ అనే అభ్యర్థి కంటే ముందుగా గుర్తు కేటాయింపు జరుగుతుంది, దీనివల్ల బ్యాలెట్ పేపర్‌పై వారి పేరు టాప్‌లో కనిపిస్తుంది.
సర్పంచ్ ఎన్నికల కోసం కేటాయించిన 30 గుర్తుల్లో ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్, టీవీ రిమోట్, టూత్‌పేస్టు, చెత్తడబ్బా, బెండకాయ, కొబ్బరితోట, డోర్‌హ్యాండిల్, టీ జల్లెడ, మంచం, చెప్పులు, క్రికెట్ స్టంప్స్ వంటి సాధారణ వస్తువులు ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన గుర్తులను గులాబీ రంగు బ్యాలెట్ పేపర్‌పై ముద్రిస్తారు. కాగా, రెండో విడత పోలింగ్ డిసెంబర్ 14న, మూడో విడత పోలింగ్ డిసెంబర్ 17న జరగనుంది.









