దక్షిణాఫ్రికాలోని మాలిలో భువనగిరి యువకుడి కిడ్నాప్

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నల్లమాస ప్రవీణ్ అనే యువకుడు దక్షిణాఫ్రికాలోని మాలి దేశంలో ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్‌కు గురయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ బోర్‌వెల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్, కంపెనీ పని మీద గత ఏడాది నవంబరులో మాలికి వెళ్ళాడు. ఈ ఘటన గత నెల 23న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భువనగిరి మండలం, బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య, మహేశ్వరి దంపతుల రెండో కుమారుడే ప్రవీణ్. గత నెల నవంబర్ 23న విధులకు వెళ్లి తిరిగి గదికి వస్తుండగా మార్గమధ్యలో జేఎన్ఐఎం (JNIM) అనే ఉగ్రవాద సంస్థ అతడిని కిడ్నాప్ చేసింది. అంతకుముందు రోజు, నవంబర్ 22న, చివరిసారిగా ప్రవీణ్ తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడాడు. అప్పటి నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. డిసెంబర్ 4న కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేసి ఈ కిడ్నాప్ విషయాన్ని తల్లిదండ్రులకు ధ్రువీకరించారు.

ప్రస్తుతం ప్రవీణ్ ఆచూకీ కోసం అతడి కంపెనీ యాజమాన్యం భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ కిడ్నాప్‌కు పాల్పడిన జేఎన్ఐఎం (JNIM) ఉగ్రవాద సంస్థ గతంలోనూ పలువురు విదేశీయులను అపహరించినట్లు సమాచారం. తమ కుమారుడిని ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా విడిపించి స్వదేశానికి తీసుకురావాలని ప్రవీణ్ తల్లిదండ్రులు కన్నీటితో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు