ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, మీర్‌ఖాన్‌పేటలోని ఫ్యూచర్ సిటీలో ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి విహంగ వీక్షణం (ఏరియల్ సర్వే) ద్వారా 100 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో మొత్తం 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు ఈ గ్లోబల్ సమ్మిట్‌కు తరలి వస్తారని అధికారులు తెలిపారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదని, తమ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆయన మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మీడియాకు సదస్సు వివరాలను వివరించారు.
గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే వివిధ దేశాల ప్రతినిధులు భారీ సంఖ్యలో వస్తారని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వెల్లడించారు. ఎయిర్‌లైన్స్ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు, కానీ ముఖ్య అతిథులకు సమస్య వస్తే వారి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు.









