మహాలక్ష్మి పథకం: రెండేళ్లు పూర్తి, ఇకపై కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం నేటితో (డిసెంబర్ 9) సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2023 డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ పథకం, మహిళా సాధికారతకు గొప్ప మార్గంగా నిలిచింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, గత రెండేళ్లలో మొత్తం 251 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దీని మొత్తం విలువ రూ. 8,459 కోట్లుగా నమోదైంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి, విద్య, ఆధ్యాత్మిక ప్రయాణాలు మరియు కుటుంబ బంధాలు పెంచుకోవడం సులువయ్యిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ సాధారణ బస్సుల్లో అమలువుతున్న ఈ పథకాన్ని త్వరలోనే అన్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం మహిళలు ఆధార్ కార్డును చూపించి ఉచిత ప్రయాణం చేస్తుండగా, భవిష్యత్తులో ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యోచిస్తోంది. ఈ స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే, వాటిని ఉపయోగించి మాత్రమే మహిళలు ఉచిత ప్రయాణం చేసే విధంగా కీలక మార్పు అమల్లోకి రానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు