టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి తారకరామారావు (జూనియర్ ఎన్టీఆర్) తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా, ప్రతిష్ఠను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని ఆరోపిస్తూ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అలాంటి అభ్యంతరకర పోస్టులను క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా, ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వైరల్ అవుతున్న పోస్టులపై విచారణ జరిపి నిందితులపై మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించారు. ఎన్టీఆర్ తరఫు న్యాయవాది జె. సాయిదీపక్, 2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగేలా ఉన్న అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో, ముందుగా సోషల్ మీడియా సంస్థలను సంప్రదించాలని, ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించాలని న్యాయమూర్తి ఈ సందర్భంగా సూచించారు. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 22కు కోర్టు వాయిదా వేసింది. గతంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కేసులో ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఈ సందర్భంగా న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.









