తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతకింది కాశీం సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రేవంత్ రెడ్డి 25 ఏళ్ల క్రితం గీతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ప్రస్తావిస్తూ, “కానీ ఇటీవల మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నారని, అందుకే ఆయన ప్రతి ప్రసంగంలో విద్య గురించి మాట్లాడుతున్నార”ని కాశీం వ్యాఖ్యానించారు.
ప్రొఫెసర్ కాశీం చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదువుల తల్లి అయిన సరస్వతి దేవిని విద్యార్థులు, ప్రజలు పూజిస్తారని, అలాంటి ‘విద్య’ను ఒక అమ్మాయి అనడం, ఆమెతో సీఎం రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డాడు అనడం భావ దారిద్ర్యానికి నిదర్శనం అని విమర్శకులు ఘాటుగా మండిపడుతున్నారు. ఎవరినైతే తెలంగాణ ప్రజలు బుద్ధిజీవులు అనుకున్నారో, వారే తమ స్వప్రయోజనాల కోసం ‘తెలంగాణ వ్యతిరేకి’ని పొగుడుతున్నారంటూ కొందరు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
మరోవైపు, ప్రొఫెసర్ చింతకింది కాశీం గతంలో కూడా వార్తల్లో నిలిచారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)తో సంబంధాలు కలిగి ఉన్నారని, పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేశారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు 2020 జనవరి 18న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కండిషనల్ బెయిల్పై ఉన్నారు. విప్లవకవిగా, సాహిత్య విమర్శకుడిగా, విప్లవ రచయితల సంఘంలో క్రియాశీలకంగా, తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్న కాశీం… ఈ వ్యాఖ్యల కారణంగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.









