తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: 395 స్థానాల్లో ‘నో పోలింగ్’

తెలంగాణలో మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, తొలి దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11, గురువారం నాడు జరగనుంది. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా, పలు సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 395 సర్పంచ్ స్థానాల్లో పోలింగ్ అవసరం లేదు. ఈ ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ, గ్రీన్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పోలింగ్ గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడుతుంది.

తొలి విడత ఎన్నికల గణాంకాల ప్రకారం, 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. 5 చోట్ల అసలు నామినేషన్ దాఖలు కాలేదు. 395 స్థానాలు ఏకగ్రీవం అయిన తరువాత, మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల కోసం మొత్తం 13,127 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డు స్థానాల విషయానికి వస్తే, 37,440 వార్డులకు గాను 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి, 149 చోట్ల నామినేషన్లు వేయలేదు. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు 67,893 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ మొదలు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ముందుగా సర్పంచ్, వార్డు మెంబర్లను ప్రకటించి, ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, తొలి విడతలో 3 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రేవంత్ ప్రభుత్వం రూ.175 కోట్లు కేటాయించగా, అందులో రూ.100 కోట్లు ఇప్పటికే జిల్లాలకు మంజూరు అయ్యాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు