విశాఖ నగరం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పరుగుల పండుగకు సిద్ధమవుతోంది. నేవీ డే వేడుకల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన 10వ ఎడిషన్ వైజాగ్ నేవీ మారథాన్ ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక మారథాన్‌కు ఇప్పటికే 17 దేశాల నుంచి 17,500 మంది ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ భారీ ఈవెంట్ విశాఖ ఖ్యాతిని మరోసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమంగా అధికారులు భావిస్తున్నారు.
ఈ మారథాన్‌కు సంబంధించి 42 కిలోమీటర్లు (ఫుల్ మారథాన్), 21 కిలోమీటర్లు (హాఫ్ మారథాన్), 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ పరుగు ఆర్కే బీచ్ వద్ద ప్రారంభమై విశాఖ తీరప్రాంతం వెంబడి అద్భుతమైన వాతావరణంలో కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి 1,000 మంది సిబ్బంది, 2,000 మంది వాలంటీర్లు సేవలు అందించనున్నారు. పాల్గొనే రన్నర్లకు అవసరమైన పార్కింగ్ వసతులు, హైడ్రేషన్ పాయింట్లు, మెడికల్ టీమ్స్, అంబులెన్సులు వంటి అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి రన్నర్‌కు డ్రై-ఫిట్ టీషర్ట్, నేవీ థీమ్ మెడల్, గూడీ బ్యాగ్, అల్పాహారం అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మారథాన్ ప్రధాన లక్ష్యం నేవీ డే వేడుకల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, శారీరక దృఢత్వం (ఫిట్నెస్), సముద్ర అవగాహనను ప్రజల్లో విస్తృతంగా చాటడమే అని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ అధికారులు వెల్లడించారు. యుద్ధ నౌకల నగరంగా పేరుగాంచిన విశాఖలో నేవీ మారథాన్ ఒక ప్రత్యేక గుర్తింపుగా మారిందని వారు పేర్కొన్నారు.









