రజనీకాంత్ 75వ బర్త్‌డే: పాత కారు, ట్రాఫిక్ జామ్, వినయం కోసం నేలపై నిద్ర… ఆసక్తికర విషయాలు!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా, ఆయన నటించిన బాలీవుడ్ మూవీ ‘చాల్‌బాజ్’ (1989) చిత్రానికి దర్శకత్వం వహించిన పంకజ్ పరాశర్ ఆనాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ నటన, నిరాడంబరత, స్టార్‌డమ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

“రజనీకాంత్ చాలా తెలివైన వ్యక్తి. ‘చాల్‌బాజ్’ శ్రీదేవి సినిమా అని ఆయన వెంటనే గ్రహించారు. తాను ఎప్పటిలా సూపర్ హీరో తరహా పాత్ర చేస్తే అది పనిచేయదని భావించి, తన పాత్రను కామెడీగా మార్చుకున్నారు. భయపడే వ్యక్తిగా నటించడానికి ఒప్పుకున్నారు, ఇది చాలా మంది స్టార్ హీరోలు చేయరు. ఆయన ఇంప్రూవైజేషన్ అద్భుతం” అని పరాశర్ తెలిపారు. సెట్‌లో శ్రీదేవి రాగానే రజనీకాంత్ సరదాగా వంగి నమస్కరిస్తూ ‘శ్రీదేవా’ అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు.

రజనీకాంత్ నిరాడంబరత తనను ఆశ్చర్యపరిచిందని పంకజ్ పరాశర్ చెప్పారు. “ఆయనకు అసిస్టెంట్, మేనేజర్ ఎవరూ ఉండేవారు కాదు. తన పాత 1960ల నాటి ఫియట్ కారును స్వయంగా నడుపుకుంటూ వచ్చేవారు. ఒకరోజు నన్ను హోటల్‌లో డ్రాప్ చేస్తానని ఆఫర్ ఇచ్చారు. ఒక సిగ్నల్ దగ్గర ఇద్దరు వ్యక్తులు ‘తలైవా’ అని అరవడంతో క్షణాల్లో జనం పోగైపోయి ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు రావాల్సి వచ్చింది. అప్పుడే ఆయన స్టార్‌డమ్ ఏంటో నాకు తెలిసింది” అని వివరించారు. అంతటి స్టార్‌డమ్ ఉన్నా, గర్వం రాకుండా ఉండేందుకు పర్వతాలకు వెళ్లి, గుడిలో నేల శుభ్రం చేసి, కిందనే పడుకుంటానని రజనీకాంత్ తనతో చెప్పినట్లు పరాశర్ గుర్తుచేసుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు