హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడంపై తెలంగాణ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాలు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడటానికి నిరాకరించారని ఆరోపిస్తూ, తెలంగాణ కళాకారులకు బదులుగా ఆయన విగ్రహాన్ని పెట్టవద్దని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఈ నిర్ణయం సరికాదని, విగ్రహం పెట్టడానికి వేరే స్థలం చూసుకోవాలని మద్దతు తెలిపారు. గతంలో, బాలు బావమరిది శుభలేఖ సుధాకర్‌తో ఉద్యమకారుడు పృథ్విరాజ్ సహా మరికొందరు వాగ్వాదానికి దిగి, హెచ్చరించిన సంఘటన కూడా జరిగింది.
సోమవారం (డిసెంబర్ 15) విగ్రహావిష్కరణ ఉన్నందున నిరసన తెలియజేస్తామని తెలంగాణ ఉద్యమకారులు ప్రకటించారు. దీంతో పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంతరాలు కలగకుండా రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించాల్సి ఉన్నా, ఆయన ఢిల్లీకి వెళ్లడంతో, పటిష్ట బందోబస్తు మధ్య మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వివాదంపై ఎస్పీ బాలు చెల్లెలు, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ స్పందించారు. ఎస్పీ బాలు గాయకులందరికీ స్ఫూర్తిదాయకం అని పేర్కొంటూ, బాలు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. విగ్రహం ఏర్పాటుపై జరుగుతున్న నిరసనల గురించి తనకు తెలియదని, ఈ విగ్రహ ఏర్పాటులో తన ప్రమేయం ఏమీ లేదని, మొత్తం సంగీతం బృందం కమిటీ చూసుకుందని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా, బాలు బతికి ఉన్నప్పుడే ఘంటసాల విగ్రహం పక్కన తన విగ్రహం పెట్టాలని చెప్పినట్లు ఆమె గుర్తు చేశారు.









