ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు రాజధాని చెన్నైకి ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ఇప్పటివరకు చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ వరకు నడిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నేటి (డిసెంబర్ 15) నుంచి నర్సాపూర్ వరకు పొడిగించారు. ఈ వందేభారత్ రైలు నర్సాపూర్ నుండి చెన్నైకు కేవలం తొమ్మిది గంటల్లోనే చేరుకుంటుంది. ఈ రైలు భీమవరం, గుడివాడ మీదుగా నర్సాపూర్ చేరుకుంటుంది, ఇది పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు పెద్ద ఉపశమనం.
నేడు (డిసెంబర్ 15) చెన్నై-నర్సాపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించగా, పూర్తి స్థాయిలో మాత్రం ఎల్లుండి (డిసెంబర్ 17) నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు నర్సాపూర్ నుండి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి, రాత్రి 11:45 గంటలకు చెన్నై చేరుకుంటుంది. ప్రయాణంలో రేణిగుంట జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ, గుడివాడ వంటి ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది.
ఈ వందేభారత్ రైలులో టిక్కెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఛైర్ కార్ (Chair Car) టిక్కెట్ ధర రూ. 1,635 గా నిర్ణయించగా, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ (Executive Chair Car) టిక్కెట్‌కు రూ. 3,030 గా ధరను నిర్ణయించారు. ఈ రైలు విస్తరణతో ప్రయాణికుల సమయం ఆదా అవడంతో పాటు, ప్రయాణం మరింత సుఖవంతంగా మారనుంది.









