ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్–2025 అందాల పోటీల్లో భారత ప్రతినిధి విద్యా సంపత్ (Vidya Sampath) విజేతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన సుందరీమణులతో పోటీపడి ఆమె ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా విద్య సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఈ పోటీల్లో ఆమె ధరించిన వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా జాతీయ పక్షి నెమలి, జాతీయ ప్రాణి పులి, మరియు జాతీయ పుష్పం థీమ్‌లతో రూపొందించిన వస్త్రాలను ధరించి ఆమె న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మంగళూరుకు చెందిన విద్య ముంబైలో పెరిగారు. వివాహం తర్వాత కూడా తన కలలను వదులుకోకుండా అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తిని చాటారు.
ప్రస్తుతం మంగళూరులోని చిత్రాపుర్‌లో ఒక సూపర్‌మార్కెట్‌ను నిర్వహిస్తున్న విద్య, ఒకవైపు విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తూనే మరోవైపు మోడలింగ్‌లో తన సత్తా చాటుతున్నారు. గతంలో ఆమె ‘మిసెస్ ఇండియా ఆస్ట్రల్ కర్ణాటక’ రన్నరప్‌గా కూడా నిలిచారు. మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తమ లక్ష్యాలను, కలలను సాధించవచ్చని ఆమె నిరూపించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.









