తెలుగు వెండితెరపై తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి ఆమని రాజకీయ అరంగేట్రం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి ఆకర్షితురాలినై, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ఆమని చేరికతో తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ పెరగడమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మహిళా ఓటర్ల మద్దతు లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “భారతీయురాలిగా గర్విస్తున్నాను, మోదీ అడుగుజాడల్లో నడుస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తాను” అని ఆమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నటిగా రెండు నంది అవార్డులు అందుకున్న ఆమె, సామాజిక అంశాలపై ఉన్న అవగాహనతో పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
నటిగా ఆమని ప్రస్థానం అత్యంత విజయవంతమైంది. 1992లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకిడిపంబ’ చిత్రంతో ఆమె కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ పెళ్లాం’ ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. శుభలగ్నం, శుభ సంకల్పం వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె, ఇటీవల సహాయ నటిగా కూడా తన సత్తా చాటుతున్నారు. ఇప్పుడు రాజకీయ వేదికపై ఆమె ఎలాంటి ప్రభావం చూపుతారో వేచి చూడాలి.









