అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామ ప్రాంతంలో ఓ సిఐ జరిపిన కాల్పులతో కలకలం రేగింది. నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై నిందితుడు ఎదురు దాడి చేయడంతో సీఐ కాల్పులు జరిగిన సంఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి అనంతపురం నగరంలోని అరవింద నగర్ లో రాజా, అజయ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించే క్రమంలో గొడవ చోటు చేసుకుంది. అజయ్, రాజాను ఇంకొంచెం మద్యం పోయాలని అడగడంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అజయ్, రాజాను కత్తితో దాడి చేశాడు. కత్తి దాడిలో గాయపడిన రాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీకాంత్ తన బృందంతో నిందితుడు అజయ్ ను పట్టుకోవడానికి ఆకుతోటపల్ల గ్రామానికి వెళ్ళాడు. నిందితుడుని పట్టుకునే క్రమంలో అజయ్… సీఐపై కత్తితో దాడి చేశాడు. సిఐ చేతికి గాయం కావడంతో నిందితుడు అజయ్ పారిపోవాలని చూసే క్రమంలో సీఐ గన్ తో నిందితుడి మోకాళ్లపై కాల్పులు జరిపాడు. గాయాలైన వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.









