శివాజీ వర్సెస్ అనసూయ: సారీ చెప్పినా తగ్గని రచ్చ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి!

నటుడు శివాజీ ఇటీవల మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెను దుమారం రేపుతున్నాయి. తన రెండో ఇన్నింగ్స్‌లో ‘కోర్ట్’ వంటి సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న శివాజీ, హీరోయిన్ల దుస్తుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కొన్ని బూతులు కూడా వాడటం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీల నుంచి వ్యతిరేకత రావడంతో శివాజీ క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన చెప్పిన ‘సారీ’ వెనుక ఉన్న విధానాన్ని తప్పుబడుతూ నటి అనసూయ భరద్వాజ్ తాజాగా ఒక వీడియోను విడుదల చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనసూయ తన వీడియోలో శివాజీని ఉద్దేశిస్తూ.. “మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? కామెంట్లు చేసినప్పుడు ఉన్న గంభీరమైన గొంతు, క్షమాపణలు చెప్పేటప్పుడు ఎందుకు తగ్గిపోయింది?” అని ప్రశ్నించారు. కేవలం సానుభూతి కోసమే శివాజీ వాయిస్ తగ్గించి మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. సినిమాల్లో పాత్రల డిమాండ్ మేరకు, కొన్నిసార్లు వ్యక్తిగత ఇష్టానుసారం దుస్తులు ధరిస్తామని, దానిపై క్లాసులు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. సమాజంలో ఫేక్ ఫెమినిస్టులు పెరిగిపోయారని, బయటకు సమానత్వం అని చెబుతూనే మహిళలను తక్కువ చేసి చూసే మనస్తత్వం శివాజీలో కనిపిస్తోందని ఆమె విమర్శించారు.

ఇదే క్రమంలో తనపై జాలి చూపినందుకు ధన్యవాదాలు తెలిపిన శివాజీకి అనసూయ గట్టి కౌంటర్ ఇచ్చారు. అది జాలి కాదని, ఒక రకమైన భావన అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తనకు ఏమైనా సమస్య వస్తే అండగా ఉంటానన్న శివాజీ మాటలను ఆమె తిరస్కరించారు. “నాకు మీ సపోర్ట్ అవసరం లేదు, నేను చాలా ధైర్యవంతురాలిని. నా వెనుక నా భర్త, స్నేహితులు ఉన్నారు, ఒంటరిగా పోరాడే దమ్ము నాకుంది” అంటూ అనసూయ కుండబద్దలు కొట్టారు. గౌరవంగా ఉంటూనే శివాజీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన అనసూయ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు