సంక్రాంతి పండుగ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం ముందే వచ్చేసింది. పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని కేఎల్ఆర్ ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి కేవలం అతిథిగా మాత్రమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగి ముగ్గులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సాధారణంగా తనదైన శైలి ప్రసంగాలతో, ‘పాలమ్మిన పూలమ్మిన’ వంటి పంచ్ డైలాగులతో అలరించే మల్లారెడ్డి, ఈ వేడుకలో స్థానిక మహిళలతో మమేకమయ్యారు. రంగు రంగుల ముగ్గులు వేస్తున్న మహిళలకు తోడుగా ఆయన కూడా రంగులు అద్దుతూ ముగ్గులు వేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉల్లాసంగా మారింది. ఎమ్మెల్యే తమతో కలిసి పండుగ జరుపుకోవడంపై స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనతో కలిసి ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు.
ఈ ముగ్గుల పోటీలకు పెద్ద ఎత్తున మహిళలు, యువతులు హాజరై తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా వివిధ రకాల ముగ్గులు వేశారు. గ్రామాల్లో సంక్రాంతి శోభను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండుగ సంప్రదాయాలను కాపాడుకోవాలని, సామాన్యులతో కలిసి ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.









