గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు, ఆయన క్షేమంగా విడుదలయ్యి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని బండ్ల గణేష్ తిరుమల వేంకటేశ్వరస్వామిని మొక్కుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు విడుదలవ్వడమే కాకుండా, భారీ మెజారిటీతో గెలిచి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన మొక్కు నెరవేరడంతో, ఇచ్చిన మాట ప్రకారం బండ్ల గణేష్ ఈ నెల జనవరి 19న పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఈ మహా పాదయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని బండ్ల గణేష్ స్వగృహం నుంచి ప్రారంభమై తిరుమల వరకు సాగనుంది. షాద్‌నగర్ నుంచి తిరుమల మధ్య సుమారు 500 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఇంతటి భారీ దూరాన్ని ఆయన కాలినడకన అధిగమించి, శ్రీవారిని దర్శించుకుని తన మొక్కును సమర్పించుకోనున్నారు. ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆయన, జనవరి 19న తన నివాసంలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూనే, ఏపీ సీఎం చంద్రబాబుపై తనకున్న అపారమైన అభిమానాన్ని ఈ పాదయాత్ర ద్వారా బండ్ల గణేష్ మరోసారి చాటుకుంటున్నారు. గతంలో కూడా చంద్రబాబు అరెస్టు సమయంలో బండ్ల గణేష్ చేసిన భావోద్వేగ ప్రసంగాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆయన చేపడుతున్న ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణం అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.









