రాజా సాబ్ కొత్త హవా: అదనపు సీన్లతో అదిరిపోయిన న్యూ వెర్షన్.. బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ‘రాజసం’!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా సాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధిస్తోంది. అయితే, విడుదలైన మొదటి రోజు వచ్చిన మిశ్రమ స్పందనను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు మారుతి అప్రమత్తమయ్యారు. సినిమాలోని కొన్ని సాగతీత సీన్లను ట్రిమ్ చేయడంతో పాటు, సుమారు 8 నిమిషాల కొత్త ఫుటేజీని జోడించి ‘న్యూ వెర్షన్’ను థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈ సరికొత్త మార్పులకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది.

ఈ కొత్త వెర్షన్‌లో ప్రధానంగా ప్రభాస్ ‘ఓల్డ్ గెటప్’కు సంబంధించిన సన్నివేశాలను యాడ్ చేయడం విశేషం. ట్రైలర్‌లో చూపించి, సినిమాలో లేకపోవడంతో నిరాశ చెందిన అభిమానులకు ఈ సీన్లు ఇప్పుడు పెద్ద సర్ ప్రైజ్ గా మారాయి. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ చేసే ‘అప్‌సైడ్ డౌన్’ ఫైట్ సీక్వెన్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తోంది. ప్రభాస్ స్వాగ్, డైలాగ్ డెలివరీ మరియు యాటిట్యూడ్ సినిమా స్థాయిని పెంచాయని, ఈ మార్పులు ముందే చేసి ఉంటే బాగుండేదని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సాంకేతిక కారణాల వల్ల (సర్వర్ ఇష్యూ) మొదటి రోజు ఈ సీన్లు యాడ్ చేయలేకపోయామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఇప్పుడు జోడించిన ఈ 8 నిమిషాల కంటెంట్ సినిమా టాక్‌నే మార్చేసింది. హారర్, ఫాంటసీ అంశాలతో పాటు చివరి 35 నిమిషాల క్లైమాక్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. మొదటి రోజే రూ. 112 కోట్ల గ్రాస్ వసూలు చేసిన రాజా సాబ్, ఈ కొత్త సీన్ల ప్రభావంతో సంక్రాంతి సీజన్ ముగిసేలోపు మరిన్ని రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు