ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మాజీ మంత్రి మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పోలీసు అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార పక్షం కళ్లల్లో ఆనందం కోసం చట్టాన్ని అతిక్రమించే అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో వాడిన మాస్ డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. “అక్రమాలకు పాల్పడే అధికారులు రిటైర్ అయి ఏ బొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తాం” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్ (SIT) లో పెట్టి, వారి ద్వారా బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. అధికారులు ఎవరివో తప్పుడు ఆదేశాలను పాటించి తమ కెరీర్‌ను పాడు చేసుకోవద్దని హితవు పలికారు. చట్టబద్ధంగా వ్యవహరించని పక్షంలో, రేపు రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి ఎలాంటి సహకారం అందించదని, అప్పుడు సొంత డబ్బులతో లాయర్లను పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ నుంచి ఇచ్చే డైరెక్షన్ల ప్రకారం కాకుండా, రాజ్యాంగం మరియు చట్టం ప్రకారం పోలీసులు విధులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు లీకులు ఇస్తూ, నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న అధికారుల పేర్లన్నీ నోట్ చేసుకుంటున్నామని, సమయం వచ్చినప్పుడు వారందరికీ సినిమా చూపిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. హరీశ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.









