మావోయిస్టులకు భారీ షాక్: దండకారణ్యం కీలక నేత మీసాల సాల్మన్ దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడు, పార్టీ మిలిటరీ ఇన్‌స్ట్రక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మీసాల సాల్మన్ అలియాస్ సంతోశ్ నాగరాజు, ఆయన భార్యను నాగర్ కర్నూలు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో బలహీనపడిన మావోయిస్టులకు, క్షేత్రస్థాయిలో పట్టున్న సాల్మన్ వంటి కీలక నేత పట్టుబడటం కోలుకోలేని దెబ్బగా పోలీసులు భావిస్తున్నారు.

నల్లమల అటవీ ప్రాంతం నుంచి అచ్చంపేటకు ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. సాల్మన్ తన అనుబంధ సంస్థల నేతల సాయంతో మహబూబ్ నగర్, నల్లమల ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో మన్ననూరు – అచ్చంపేట మార్గంలో పోలీసులు మాటువేసి వీరిని పట్టుకున్నారు.

కేవలం మావోయిస్టు దంపతులనే కాకుండా, వారికి ఆశ్రయం కల్పిస్తూ సహకరిస్తున్న మరో ముగ్గురు కీలక వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో సివిల్ లిబర్టీస్ కమిటీ జాయింట్ సెక్రటరీ జక్క బాలయ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతలు ఎడ్ల అంబయ్య, మంశెట్టి యాదయ్య ఉన్నారు. రాష్ట్రంలో తిరిగి మావోయిస్టుల ప్రాబల్యాన్ని పెంచేందుకు వీరంతా కలిసి కుట్ర పన్నుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి అరెస్ట్‌తో నల్లమల ప్రాంతంలో మరోసారి హై అలర్ట్ ప్రకటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు