మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చిని మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, చర్చి ప్రాంగణంలో మొక్క నాటారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మంగళగిరిని దేశంలోనే అగ్రగామి మరియు ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మార్చుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఏడాది కాలంలోనే చర్చి నిర్మాణాన్ని పూర్తి చేసిన కమిటీ సభ్యుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
తన రాజకీయ ప్రయాణాన్ని ఉదాహరణగా చూపుతూ యువతకు లోకేశ్ ధైర్యాన్ని నూరిపోశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఎదురైన ఓటమిని తాను ఒక పరీక్షగా భావించానని, కుంగిపోకుండా ప్రజల మధ్య ఉండి పనిచేయడం వల్లే ఈరోజు మీ ఆశీస్సులు పొందగలిగానని గుర్తుచేశారు. చిన్న చిన్న సమస్యలకే ఆందోళన చెంది, పరీక్షల్లో విఫలమయ్యామని ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరమని, కష్టాలను జయించే శక్తిని ఆ దేవుడే ఇస్తాడని ఆయన హితవు పలికారు.
కష్టకాలంలో తోటివారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని, ఐక్యతతో ఏదైనా సాధించవచ్చని లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.








