చిన్నారులకు సోషల్ మీడియా దూరం: విదేశీ విధానాలపై లోకేశ్ సమీక్ష.. ఫేక్ న్యూస్‌పై ఉక్కుపాదం!

చిన్నారులను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి రక్షించేందుకు కఠిన విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రుల బృందం (GoM) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడంపై అంతర్జాతీయంగా అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. సోషల్ మీడియా వేదికలు కేవలం వినోదం కోసమే కాకుండా జవాబుదారీతనంతో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

అంతర్జాతీయ విధానాల అధ్యయనం

చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం లేదా వయోపరిమితి విధించే అంశంలో సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అమలవుతున్న చట్టాలను పరిశీలించాలని లోకేశ్ సూచించారు. ముఖ్యంగా మలేషియాలో ‘మై డిజిటల్ ఐడీ’ మరియు పాస్‌పోర్ట్ వివరాలతో ఈ-కేవైసీ (e-KYC) అనుసంధానం చేయడం ద్వారా 16 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే యాక్సెస్ ఇస్తున్న విధానాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో కొత్త గైడ్ లైన్స్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విద్వేషపూరిత పోస్టులపై కఠిన చర్యలు

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారితో పాటు కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ ఆదేశించారు. నిరంతరం నేరాలు చేసే ‘హెబిచ్యువల్ అఫెండర్స్’ను గుర్తించి కట్టడి చేయాలన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు గూగుల్, మెటా (ఫేస్‌బుక్/ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫామ్‌ల కంప్లయన్స్ ఆఫీసర్లను తదుపరి సమావేశానికి రప్పించాలని అధికారులకు సూచించారు.

సైబర్ పోలీస్ స్టేషన్లు మరియు ఐటీ చట్టం అమలు

సోషల్ మీడియాలో వేధింపులను అరికట్టేందుకు ఐటీ యాక్ట్ సెక్షన్-46 ప్రకారం రాష్ట్రస్థాయి అడ్జుడికేటింగ్ ఆఫీసర్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు మరిన్ని సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ ‘సహయోగ్’ పోర్టల్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొని చిన్నారుల భద్రతపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు