కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన 55వ చిత్రాన్ని ‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామితో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా అడుగుపెట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. “ఇది జరుగుతుందని మీరు ఊహించి ఉండరు” అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ధనుష్, శ్రీలీల కలిసి ఉన్న ఫోటోలను పంచుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
శ్రీలీల ఇప్పటికే ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టగా, ధనుష్ సరసన ఆమె నటిస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాను ధనుష్ తన సొంత బ్యానర్ వుండర్‌బార్ ఫిల్మ్స్ లో నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని వార్తలు వచ్చినా, చివరకు శ్రీలీల పేరు ఖరారు కావడంతో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం సాయి అభ్యాంకర్ (Katchi Sera ఫేమ్) సంగీతం అందిస్తున్నారు. వైవిధ్యమైన కథలతో సాగే ధనుష్ నటనకు, శ్రీలీల ఎనర్జీ తోడైతే వెండితెరపై కనువిందు ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది.









