గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి, వెండి ధరలకు శనివారం భారీగా బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు అమాంతం పడిపోయాయి. ముఖ్యంగా వెండి ధరల్లో ఊహించని రీతిలో భారీ క్షీణత నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు, కామెక్స్ (Comex)లో వెండి ధరలు 31 శాతం వరకు పడిపోవడం భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.
ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా 18.85 శాతం (రూ.72,500) తగ్గి రూ.3,12,000 వద్ద స్థిరపడింది. గురువారం నాడు వెండి ధర ఏకంగా రూ.4 లక్షల మార్కును దాటి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, వరుసగా రెండు రోజులుగా వెండి తన విలువను కోల్పోతూ వస్తోంది. వెండితో పాటే బంగారం కూడా అదే బాటలో నడిచింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2 శాతం క్షీణించి రూ.1.65 లక్షలకు చేరుకుంది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ నివేదిక ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 11 శాతం పడిపోవడంతో దేశీయంగా కూడా ధరలు దిగివచ్చాయి. గత కొన్నాళ్లుగా ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలుకు దూరమయ్యారు. అయితే ప్రస్తుత పతనం ఇన్వెస్టర్లకు లాభాలను మిగిల్చినప్పటికీ, కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది స్వల్ప ఊరటనిచ్చే అంశం. రానున్న రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ధరల్లో మరిన్ని మార్పులు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.









