ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్

అరెస్టుకు దారితీసిన పరిణామాలు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై వైసీపీ చేపట్టిన ‘పాప ప్రక్షాళన’ పూజల కోసం అంబటి రాంబాబు గుంటూరు జిల్లా గోరంట్లకు వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు అంబటి కారును అడ్డుకోగా, తీవ్ర అసహనానికి గురైన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. దీనిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నల్లపాడు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు.

నివాసం వద్ద ఉద్రిక్తత.. భారీ బందోబస్తు

శనివారం రాత్రి గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అంబటి అరెస్ట్ వార్త తెలియగానే వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు అంబటి కారును, కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం భారీ భద్రత మధ్య అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

స్పందించిన వైఎస్ జగన్.. హైకోర్టులో పిటిషన్

అంబటి అరెస్ట్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అంబటితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పిన జగన్.. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాగా, అంబటి అరెస్టును సవాలు చేస్తూ ఆయన సతీమణి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు