నోటీసులపై తీవ్ర అభ్యంతరం
తన నివాసం గోడకు నోటీసులు అంటించడంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఇచ్చే నోటీసులను ఇలా బహిరంగంగా ప్రదర్శించడం చట్టవిరుద్ధమని, ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమేనని మండిపడ్డారు. పోలీసుల ఈ చర్య కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
చట్టపరమైన నిబంధనల ప్రస్తావన
65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసం వద్దే విచారించాలని సీఆర్పీసీ సెక్షన్ 160 స్పష్టంగా చెబుతోందని కేసీఆర్ గుర్తు చేశారు. తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లోని చిరునామాను సాకుగా చూపి నందినగర్ గోడకు నోటీసు అంటించడాన్ని ఆయన తప్పుబట్టారు.
విచారణకు సిద్ధమన్న కేసీఆర్
అక్రమ పద్ధతిలో నోటీసులు ఇచ్చినప్పటికీ, ఒక బాధ్యతాయుత పౌరుడిగా తాను విచారణకు సహకరిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ (రేపు) మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలోనే అందుబాటులో ఉంటానని వెల్లడించారు. అయితే, ఏసీబీ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.









