కల్తీ నెయ్యిపై సంచలన ఆరోపణలు
వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. నిబంధనలను తుంగలో తొక్కి, కనీసం ఆవుపాలు కూడా లేని డెయిరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేశారని ఆరోపించారు. కేవలం కమీషన్ల కోసమే తనకు కావాల్సిన వారికి ఆర్డర్లు ఇచ్చి, హవాలా రూపంలో ముడుపులు అందుకున్నారని విమర్శించారు. లడ్డూ కోసం వాడిన పదార్థాల్లో మోనో గ్లిజరైట్, లాక్టిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలతో పాటు జంతు కొవ్వు అవశేషాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన వెల్లడించారు.
అసెంబ్లీకి రావాలని సవాల్
“జగన్కు నిజంగా ధైర్యం ఉంటే, ఈ నెల 11వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు తన 11 మంది సభ్యులతో కలిసి రావాలి. అక్కడ ఈ కల్తీ నెయ్యి అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలి” అని మంత్రి సవాల్ విసిరారు. దైవంపై నమ్మకం లేని జగన్, దేవుడి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసే స్థాయికి దిగజారారని, దేవుడితో ఆటలాడినందుకు ఆయన కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు.
వైసీపీ గైర్హాజరు – కారణం ఇదేనా?
అయితే, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో వైసీపీ ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉండటంతో సాంకేతికంగా వారికి ప్రతిపక్ష హోదా లభించలేదు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో, మంత్రి కొల్లు రవీంద్ర కావాలనే జగన్ను రెచ్చగొట్టేలా ఈ ’11’ సంఖ్యను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.









