ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం
2026-27 సంవత్సరానికి గరిష్ట స్థాయిలో రూ. 10,134 కోట్ల నిధుల కేటాయింపు
• గౌరవ రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ 2026 బడ్జెట్ ముఖ్యాంశాలు పై మీడియాతో సమావేశం.
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 92,649 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
రైల్వేలకు కేటాయింపులతో కూడిన కేంద్ర బడ్జెట్‌ను 01 ఫిబ్రవరి 2026 న పార్లమెంట్‌లో సమర్పించారు. ఈ సందర్భంగా గౌరవ కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, న్యూఢిల్లీ నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపుల ముఖ్యాంశాలపై ఈరోజు ఫిబ్రవరి,02 2026న వర్చువల్ గా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులోని ముఖ్యాంశాలు :
ఈ సందర్భంగా శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ 2026-2027సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ. 10,134 కోట్ల బడ్జెట్ కేటాయింపులు మంజూరు అయ్యాయని తెలియజేశారు. 2009-14 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వార్షిక సగటు బడ్జెట్ వ్యయం రూ . 886 కోట్లు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రానికి 2009-14 మధ్య కాలంలో జరిగిన సగటు కేటాయింపులతో పోలిస్తే 11 రెట్లు పెరిగిందని తెలియజేశారు.
గౌరవ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. 92,649 కోట్ల కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయని మరియు ఆంధ్రప్రదేశ్‌లో ని రైల్వే నెట్‌వర్క్ ఇప్పుడు 100శాతం విద్యుదీకరణ చెందిందని తెలియజేశారు.
గౌరవ మంత్రి దేశవ్యాప్తంగా ఏడు హై స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. ఈ ఏడింటిలో, హైదరాబాద్ – బెంగళూరు మరియు హైదరాబాద్ – చెన్నై అనే రెండు హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్తాయి మరియు రాష్ట్ర ప్రజలకు అపారంగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ రెండు హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కారిడార్లు ఆర్థిక వృద్ధి కారిడార్లుగా పనిచేస్తూ విద్య, ఆరోగ్యం, వ్యాపారం మొదలైన వాటికి సౌకర్యం కల్పిస్తాయి. ఈ హై స్పీడ్ రైళ్ల ప్రవేశంతో హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణ సమయం 2 గంటలు మరియు హైదరాబాద్ – చెన్నై మధ్య ప్రయాణ సమయం 2 గంటల 55 నిమిషాలుగా ఉంటుందని అంచనా.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రాజెక్టులలో పెట్టుబడులపై నిరంతర దృష్టి సారించడంవలన రాబోయే సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి మరియు మెరుగైన అనుసంధానాన్ని వైపు ముందుకు నడిపించే ఒక ముఖ్య మైన శక్తిగా రైల్వే బడ్జెట్ నిలుస్తుంది.
Post Views: 50









