‘అమ్మ రాజీనామా’ : ఘట్‌కేసర్ విషాదంపై ఈటల రాజేందర్ ఎమోషనల్ ట్వీట్

సమాజ అంతరాత్మను కదిలించిన ఘటన

హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి (38), తన కుమార్తె చైతన్య రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17)తో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడటం తెలుగు రాష్ట్రాలను కలిచివేసింది. దీనిపై స్పందించిన ఈటల రాజేందర్, ఒక కన్నతల్లి తన బిడ్డలతో కలిసి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వర్ణించలేనంత మానసిక వేదనను కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ “అమ్మ రాజీనామా” ఘటన సమాజం యొక్క అంతరాత్మను కదిలించాలని, లేదంటే మన జీవన విధానానికే అర్థం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవితాన్ని ప్రేమించండి.. నిరాశను ద్వేషించండి

మరణం అనేది సమస్యలకు పరిష్కారం కాదని, అది కేవలం తీరని శూన్యాన్ని మాత్రమే మిగులుస్తుందని ఈటల తన సందేశంలో స్పష్టం చేశారు. “జీవితాన్ని ప్రేమించండి.. నిరాశను ద్వేషించండి” అంటూ యువతకు, కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పారు. బతుకు మీద ఆశ కోల్పోకుండా, ఆత్మనిర్భరతతో పోరాడాలని ఆయన సూచించారు. మన చుట్టూ ఉన్న పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకుని, ఆఖరి వరకు జీవించాలనే పట్టుదలను కలిగి ఉండాలని కోరారు.

మిస్టరీగా మారిన ఆత్మహత్య కారణాలు

భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా నిలకడగా ఉన్నప్పటికీ, విజయశాంతి రెడ్డి తన పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. శనివారం తెల్లవారుజామున చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ముగ్గురూ ఒకరినొకరు హగ్ చేసుకుని రైలుకు ఎదురెళ్లడం ఈ ఘటనలోని తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈటల రాజేందర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మానసిక ధైర్యం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు