మూవీ పైరసీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఇమంది రవి (ఐబొమ్మ రవి) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవి, తనపై నమోదైన నాలుగు సైబర్ క్రైమ్ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. మంగళవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, తదుపరి విచారణను మూడు రోజుల పాటు అంటే వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
అంతకుముందు, ఐబొమ్మ రవి బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించగా అక్కడ అతనికి నిరాశే ఎదురైంది. పైరసీ తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో, నిందితుడు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు తమ కౌంటర్ దాఖలు చేస్తూ.. నిందితుడు దేశ విదేశాల్లో సర్వర్లను ఏర్పాటు చేసి భారీ పైరసీ సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడని, పోలీసుల విచారణకు సరిగ్గా సహకరించడం లేదని న్యాయస్థానానికి వివరించారు.
విచారణ సందర్భంగా పోలీసులు మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఐబొమ్మ రవిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారిందని, అతను ఈ-మెయిల్స్ ఆధారంగా ఎట్టకేలకు చిక్కాడని పేర్కొన్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న రవి, విదేశాల్లో ఉన్న డేటా మరియు ఏజెంట్లకు సంబంధించిన సమాచారాన్ని దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేసిన ఈ కేసులో హైకోర్టు శుక్రవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.









