మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిర్యాలగూడ సభలో రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాషను తప్పుబడుతూ, రేవంత్‌ను ‘శునకం’తో పోలుస్తూ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినా అది రాజవదని, అది ఆ సింహాసనానికే అవమానమని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.
హార్వర్డ్ స్కూల్‌లో 500 రోజులు కోర్సులు చేసినా రేవంత్ రెడ్డికి కనీస సంస్కారం అబ్బలేదని, కుక్క తోక ఎప్పటికీ వంకర అన్న చందంగా ఆయన ప్రవర్తన ఉందని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ సాధించి, రాష్ట్రాన్ని పదేళ్లపాటు అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్‌ను ఏకవచనంతో సంభోదించడం రేవంత్ అహంకారానికి, అసమర్థతకు పరాకాష్ట అని విమర్శించారు. అభివృద్ధి పథకాలు, పాలసీల గురించి మాట్లాడటం చేతకాని వాళ్లే ఇలా మురికి భాషతో విషం చిమ్ముతారని మండిపడ్డారు.
తెలంగాణ చరిత్రను సృష్టించిన నాయకుడిని ఇలాంటి నీచపు మాటలతో తక్కువ చేయలేరని, రేవంత్ రెడ్డి తన మానసిక దరిద్రాన్ని ప్రజల ముందు ప్రదర్శించుకుంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులపై నోరు పారేసుకునే నైతిక హక్కు రేవంత్‌కు లేదని, ఆయన స్థాయి మురికి కాలువలతోనే సమానమని పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి అరాచక భాషకు బుద్ధి చెబుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.









