హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగు రోడ్డు (ORR) పై శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సంగారెడ్డి జిల్లా పోచారం సమీపంలో అతివేగం కారణంగా ఒక కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి ఓఆర్ఆర్ నుండి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మౌనిక (36), నవీన్ (30) అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే, బోరంపేటలోని సింహపురి కాలనీకి చెందిన ఈ కుటుంబం వీకెండ్ కావడంతో తమ బంధువులతో కలిసి నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు వెళ్లారు. రోజంతా అక్కడ సరదాగా గడిపి, రాత్రి కారులో తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని హరిప్రసాద్, హర్ష, సుశ్రుత, అమృత, అగస్త్యలుగా పోలీసులు గుర్తించారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పటాన్‌చెరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుశ్రుత అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









